రైస్ మిల్లర్లలో ‘మిషన్ కే 100’ వణుకు
- ధనలక్ష్మీ మిల్లు యాజమాని అరెస్ట్
- జాబితాలో మరో 16 మిల్లులు
- మహబూబాద్‌లో దూకుడుమీదున్న అధికారులు
- పెద్దతలలపై ఉదాసీనత, అలాంటిదేం లేదన్న అధికారులు
మహబూబాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీఎంఆర్ ధాన్యం మిల్లు పట్టి బియ్యం ఇవ్వకుండా పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చేపట్టిన ఆపరేషన్ ‘మిషన్ కే 100’ డిఫాల్ట్ రైస్ మిల్లర్లలో వణుకు పుట్టిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు మొదలుపెట్టారు.
జిల్లావ్యాప్తంగా డిఫాల్ట్ మిల్లర్లతోపాటు, టెండర్ ప్యాడీ బకాయిలు ఉన్న రైతు మిల్లర్లపై సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే డిఫాల్ట్ మిల్లర్లు, టెండర్ ప్యాడి బకాయి ఉన్న మిల్లర్లతో పాటు వారికి జమానత్‌దారులుగా ఉన్న వారి వివరాలను పూర్తిగా సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 16 మిల్లుల వరకు ఈ జాబితాలో ఉన్నాయని, వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు ద్వారా రంగం సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా గూడూరు మండలం వెంగంపేటకు చెందిన ధనలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమాని బండి రాజమౌళి 2023--24లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 3.59 కోట్ల రూపాయల ధాన్యం బకాయి పడ్డారని, అనేకసార్లు నోటీసులు జారీ చేసినా బకాయి చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాడని జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసినట్లు గూడూరు సీఐ వినయ్ కుమార్ తెలిపారు.
మిగతా రైస్ మిల్లర్లపై కూడా క్రిమినల్ కేసులు, మిల్లర్ల అరెస్టులకు సిద్దమవుతున్నారు. అయితే కొందరు మిల్లర్లు పోలీసు కేసులు, అరెస్టుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా ‘పెద్ద తలల’ పట్ల కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.






