23 August, 2026 | 1:43 AM

24న ఆటోల బంద్

23-08-2026 12:45 AM

12 డిమాండ్ల సాధన కోసం సమ్మెలో పాల్గొననున్న ఆటో డ్రైవర్లు

జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 24న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌లో జడ్చర్ల ఆటో డ్రైవర్లు పాల్గొంటారని జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ హాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్చర్లలోని ఆటో డ్రైవర్లందరూ 24న ఉదయం జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం మొత్తం 12 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీకి ఈవీ ఆటోలు ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం, ఆటో–రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, పెరిగిన ఇంధనం, గ్యాస్, నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచడం ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడోకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని, యాప్‌ల ద్వారా అక్రమంగా నడుస్తున్న టూవీలర్లను నిషేధించాలని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ-చలాన్ల నుంచి ఆటో డ్రైవర్లకు మినహాయింపు, జీఓ నెం.263లోని మిగిలిన ఆటోల పంపిణీ, వాహన సారథి పోర్టల్‌లో ఆటో డ్రైవింగ్ లైసెన్స్ కొనసాగింపు వంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.

రవాణా వాహనాలకు రేడియం స్టిక్కర్ల విషయంలో జీఓఎంఎస్ నెం.60లో ఆటోలకు మినహాయింపు ఇవ్వాలని, గిగ్ అండ్ ప్లాట్‌ఫారం యాప్ ఆధారిత సోషల్ సెక్యూరిటీ బోర్డులో ఆటో, క్యాబ్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, యాక్సిడెంట్ బీమాను కొనసాగిస్తూ సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రవ్యాప్త బంద్‌లో INTUC, BRTU, CITU, TUCI, AITUC, BMS, TNTUC, TRTU, TADS, TADU, IFTU తదితర సంఘాలు పాల్గొంటున్నాయని షేక్ హాజీ తెలిపారు. జడ్చర్లలోని ఆటో డ్రైవర్లందరూ సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.