23 August, 2026 | 2:20 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు

23-08-2026 12:39 AM

రూ.32 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో పరికరాల ఏర్పాటు..

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ యెన్నం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.32 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి ప్రారంభించారు. విరోచి ల్యాబొరేటరీస్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం, నాలుగు డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ యంత్రాలు, సి-ఆర్మ్ ఆపరేషన్ మిషన్, డ్రిల్ మిషన్‌లను సమకూర్చింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన పరికరాల ఏర్పాటుతో చిన్నారులు, గర్భిణీలు, ఆర్థోపెడిక్ సర్జరీలకు అవసరమైన అధునాతన వైద్య సాంకేతిక పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

సీఎస్‌ఆర్ నిధులతో వైద్య పరికరాలు సమకూర్చిన విరోచి ల్యాబొరేటరీస్ సంస్థ యజమాని ప్రతాప్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించి ఘనంగా సన్మానించారు. గత నెల పీడియాట్రిక్స్ వార్డులో అవసరమైన పరికరాలు, స్ట్రెచర్లు అందుబాటులో లేవని గుర్తించి దాదాపు రూ.15 లక్షలతో వాటిని సమకూర్చామని తెలిపారు.

రూ.5.76 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు

ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రూ.5.76 కోట్ల నిధులు మంజూరయ్యాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని రకాల పరికరాలను గుర్తించి ఎస్టిమేషన్లు సిద్ధం చేస్తున్నామని, త్వరలో టెండర్లు నిర్వహించి అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు.

అనంతరం జరిగిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి, రోగుల సంక్షేమం, రూముల కేటాయింపు, మానవ వనరుల అవసరాలపై సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలు, వాటి కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రోజుకు 2 వేల మంది ఓపీ రోగులు

ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి భారీగా రోగుల రద్దీ ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రోజుకు దాదాపు 2,000 మంది అవుట్‌పేషెంట్లు, 150 మంది ఇన్‌పేషెంట్లు వస్తుండగా, 20 నుంచి 30 వరకు డెలివరీలు జరుగుతున్నాయని చెప్పారు. క్యాజువాలిటీ సేవలకు కూడా భారీగా రద్దీ ఉంటోందన్నారు. హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రులకు సమానంగా రోగులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత మౌలిక వసతులు సరిపోవడం లేదని, వాటిని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఆసుపత్రిని సందర్శిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కొత్త ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత మరింత పెద్ద స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని, అప్పటివరకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రస్తుత ఆసుపత్రిలోనే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి ముందు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, డాక్టర్ సామ్యుల్, సాదుల్లా, కార్పొరేటర్ సల్మాన్, ఉమర్ కొత్వాల్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.