23 May, 2026 | 4:03 AM

జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా పని చేయాలి

23-05-2026 01:41 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, మే 22 (విజయ క్రాంతి) : జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు క్షేత్రస్థాయి అధికారులు సమష్టి ఆలోచనలతో, కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి నివేదికపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం స్థానిక రవి మహల్ లో శుక్రవారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి తోడుగా ఉంటారన్నారు.గ్రామాల్లో మహిళా సంఘాలకు స్వంత భవనాలు లేకపోతే, సంబంధిత ఎంపీడీఓ ద్వారా తగిన ప్రతిపాదనలు పంపించాలని, అలా వచ్చిన ప్రతిపాదనలకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 370కి పైగా భవనాల ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఇప్పటికే 200 మహిళా సంఘ భవనాలకు గ్రౌండింగ్ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు.

అదేవిధంగా, క్షేత్రస్థాయిలో మహిళల సౌకర్యార్థం రూ.10 లక్షల వ్యయంతో షెడ్స్ నిర్మించుకునే అవకాశం ఉందని, వీటి కోసం కూడా త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. అదేవిధంగాదివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 50 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూపాందించిన 342 ప్రత్యేక పరికరాలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరికరాలను ప్రత్యేకంగా ’అలింకో’ కంపెనీ ద్వారా నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ మారకద్రవ్యాలను కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్లు, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు మరింత పటిష్టంగా పనిచేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాయని స్పష్టం చేశారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరిసింగ్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, డి ఆర్ డి ఓ పి డి సన్యాసయ్య, జడ్పీ సీఈవో శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సిపిఓ కిషన్, డి ఎస్ సి డి ఓ దయానందరాణి, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు, సర్పంచులు, డ్వాక్రా మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.