ప్రగతి పథంలో మానుకోట జిల్లా: కలెక్టర్
మహబూబాబాద్, మే 22 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వినియోగిస్తూ మహబూబాబాద్ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు సమిష్టి కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారితనం పారదర్శకతతో కూడిన మెరుగైన పాలన, ప్రజా అభిప్రాయానికి ప్రత్యేకించి, నిరుపేద అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సామాజిక న్యాయ ఆర్థిక సాధికారిక లక్ష్యంగా, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాలు, బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు.
పంట మార్పిడి విధానం ద్వారా రైతులకు అధిక లాభాలు, సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిలో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 6వ స్థానంలో నిలిచామన్నారు. మక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు తరలింపులో రికార్డు స్థాయిలో జిల్లా నిలిచిందన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వచ్చిన పెన్షన్ దరఖాస్తులన్నీ పరిశీలించి సిద్ధంగా ఉన్నామన్నారు. 7,540 స్వయం సహాయ బృందాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు.
సభా ప్రాంగణం లో రెండు పడకల గదుల నిర్మాణం, ఆయిల్ పామ్, వ్యవసాయ, పరిశ్రమలు వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ క్రాస్, చేనేత వస్త్రాల, తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తులు డిజిటలైజ్ చేసి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిలో రాష్ట్రంలో జిల్లా ఆరవ స్థానంలో ఉందని, మిగిలిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు,
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఐదవ స్థానంలో జిల్లా ఉందని, ఇంటర్మీడియట్ , వృత్తివిద్య కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతామన్నారు. స్వీయ గణన, ఇండ్ల గణన సర్వేలు జిల్లా ప్రణాళిక ప్రకారం సర్వే కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను ఇవ్వాలని కోరారు.ఎస్‌ఐఆర్ మ్యాపింగ్లో వేగంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అన్ని పారామీటర్లలో ముందంజలో ఉందని మరింత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జెడ్పి సీఈవో పురుషోత్తం, రెవెన్యూ డివిజనల్ అధికారులు క్రిష్ణవేణి, గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, స్వయం సహాయక బృందాలు, జిల్లాలోని అందరూ ఎంపీడీవోలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.






