28 August, 2026 | 8:20 AM

మాదకద్రవ్యాల నియంత్రణ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి

28-08-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, ఆగస్టు 27 : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ దిశగా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో డిసిపి ఎగ్గడి భాస్కర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మాదక ద్రవ్య రహిత మంచిర్యాల జిల్లా సాధనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 49 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇందులో 103 మందిని గుర్తించడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి కోర్టు ద్వారా 30 మందిని డ్రగ్ డి-అడిక్షన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  విద్యా సంస్థలలో విద్యార్థులచే యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, వారి ద్వారా ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై క్విజ్, డ్రాయింగ్ మొదలగు పోటీలను నిర్వహించాలని తెలిపారు.

విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించడం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను అమ్మడం నిషేధించడం జరిగిందని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మెడికల్, ఐటిఐ, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలలో నిత్యం మాదక ద్రవ్యాల వినియోగంపై విద్యార్థులను గమనిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలోని మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను నియంత్రించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గంజాయి తదితర మొక్కల సాగు చేసే వారిని గుర్తించాలని తెలిపారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ లను నిత్యం పర్యవేక్షించాలని, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించే షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.