ఇంద్రవెల్లి అమరవీరులకు అధికారికంగా నివాళులు
నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు
అమరుల సంస్మరణలో మాజీ మావోయిస్టులు
ఉట్నూర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు అధికారికం గా ఘన నివాళులు అర్పించారు. సోమవారం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జ పటేల్, కోవా లక్ష్మీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఇన్చార్జి కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదివాసీ నేతలు వచ్చి స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.
ముందుగా మండల కేంద్రంలోని గోం డు గూడ నుండి ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయ వాయిద్యాలతో అమరవీరుల స్మారక స్థూపం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయంగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద ప్రత్యేక పూజలు చేసి, జెండాను ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరులకు మావోయిస్టు మాజీ నాయకు లు, మాజీ దళా కమాండర్లతో పాటు మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు చంద్రన్న అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిశారు. అదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల నుండి వచ్చిన పెద్దలతో చంద్రన్న పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.
అనంతరం సంస్మరణ సభలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. అమరవీరులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అధికారకంగా సంస్మరణ సభ నిర్వహించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసులు పట్ల అపారమైన నమ్మకం, ప్రేమ ఉంటాయని ఆయన మొదలుపెట్టె ప్రతి కార్యక్రమానికి ముందుగా జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.
అనాడు పిసిసి అధ్యక్షుడిగా దళిత, గిరిజన దండోరాతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ప్రమాణస్వీకారం రోజున కోటి రూపాయలతో ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివన ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారాని తెలిపారు. ఆదివాసులు భూమి , భక్తి విముక్తి కొరకు పోరాటం చేసి అమరులైన ఆదివాసీల కుటుంబాలకు పెద్దన్నాల అండగా నిలిచిన ఘనత ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఐటీడీఏ ద్వారా అమరవీరుల కుటుంబాలకు రుణాలు అందించాం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం, ఆర్ధికంగా వారికి తోడుగా నిలిచాం అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, తుడం దెబ్బ నాయకులు గోడం గణేష్, ఉమ్మడి జిల్లాలోని పటేళ్లు, సార్ మేడిలు, అదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






