ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార వితరణ
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కల్మలచెరువు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గ్రామ వార్డు సభ్యులు సోమవారం ఉచితంగా అల్పాహారం అందించారు. పాఠశాలలోని విద్యార్థులకు ఒక నెల పాటు ప్రతిరోజు ఉదయం పూట అల్పాహారం అందించుటకు గ్రామ వార్డు సభ్యులు ఏవీ రెడ్డి ముందుకు వచ్చి తన వితరణను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి దాత ఏవీ రెడ్డి ముందుకు రావడం హర్షనీయమని పేర్కొన్నారు. మరుసటి నెలపాటు మాజీ సర్పంచ్ కుకూనురి అంజయ్య, తరువాత నెలలో 1988-89 సంవత్సరపు పదవ తరగతి పూర్వం విద్యార్థులు అల్పాహారం అందించుటకు ముందుకు రావడం జరిగిందని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాత ఏవీ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారంను పంపిణీ చేశారు.






