ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు సామాజిక సైనికులు
ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ సైదియా నాయక్
మెదక్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి) :జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు సామాజిక సైనికులుగా భావించి సమాజ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ సైదియా నాయక్ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ లో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్ క్లీనింగ్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ లక్ష్యంతో చేపట్టిన శుభ్రత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్ ఎస్‌ఎస్ వాలంటీర్లు సమాజంలో సేవాభావంతో పనిచేస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వాలంటీర్లు సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో మెదక్, నర్సాపూర్ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, టిటిడబ్ల్యూఆర్ డిగ్రీ కళాశాల మెదక్, ఎల్లంకి డిగ్రీ కళాశాల నర్సాపూర్ తదితర కళాశాలల నుండి మొత్తం 314 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
వాలంటీర్లు స్థానిక రైల్వే స్టేషన్, స్టేడియం, కొత్త బస్టాండ్ ఆవరణ, తారకరామా నగర్ హౌసింగ్ బోర్డ్ ప్రాంతం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాలలో శుభ్రత కార్యక్రమం చేపట్టి దాదాపు 20కి పైగా ప్లాస్టిక్ సంచులను సేకరించి మున్సిపాలిటీ అధికారులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ స్టేట్ ఆఫీసర్ నరసింహ గౌడ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ చలిమల వెంకటేశ్వర్లు,కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కె. హుస్సేన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రో గ్రామ్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీలత, మురళి, శరద్దీపిక, సువర్ణ, శ్రీనివాస్, భూమేష్, కృష్ణ, ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు.




