7 May, 2026 | 6:51 PM

తమాషాలు చేస్తున్నారా... రైతులు అంటే చిన్నచూపా...

07-05-2026 06:00 PM

రైస్ మిల్లర్లపై ఎమ్మెల్యే పోచారం ఆగ్రహం...

రైతులను మోసం చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని  హెచ్చరిక..

దేశాయ్‌పేట రైతు సదస్సులో రైతుల ఫిర్యాదులపై తక్షణ స్పందన... 

జిల్లా పౌర సరఫరాల అధికారికి విచారణకు ఆదేశం...

బాన్సువాడ, మే 7 (విజయ క్రాంతి): తమాషాలు చేస్తున్నారా... రైతులంటే అంత చిన్న చూపా అంటూ రైతుల ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైస్ మిల్లర్లు తూకంలో అక్రమాలకు పాల్పడుతూ రైతులను దోచుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం దేశాయ్‌పేటలో జరిగిన రైతు సదస్సు అనంతరం పలువురు రైతులు ఎమ్మెల్యేను కలిసి రైస్ మిల్లర్ల అక్రమాలను విన్నవించారు. ఒక రైస్ మిల్లులో 100 క్వింటాలు తూగిన ధాన్యం, అదే బస్తాలు వేరే మిల్లులో 90 నుంచి 95 క్వింటాలు మాత్రమే వస్తున్నాయని, దీనిపై ప్రశ్నిస్తే మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా "ఏం చేసుకుంటారో చేసుకోండి" అని బెదిరింపులకు దిగుతున్నారని రైతులు వాపోయారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, వెంటనే సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకొనేది లేదు. తూకంలో మోసం చేస్తున్న మిల్లులపై అవసరమైతే లైసెన్స్ రద్దు చేయండి. ఇకపై ప్రతి మిల్లులో తూకం పారదర్శకంగా జరిగేలా చూడాలి. రైతులకు న్యాయం జరగాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని, అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.