ఆ నివేదిక చెల్లదు
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పరిధి దాటింది
- మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదన
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
- రేపటికి విచారణ వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం
హైదరాబాద్, ఫిబ్రవరి 25(విజయక్రాం తి): కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తరఫున న్యాయవాది సుందరం పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని, కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం ప్రకారం ఆ నివేదిక చెల్లదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ నివేదికను రద్దు చేయాలంటూ గతంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్‌కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై జరిగిన విచారణ సందర్భంగా హరీశ్‌రావు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సుంద రం వాదనలు వినిపించారు.
మేడిగడ్డ పిల్లర్ కుంగిపోతే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని.. తర్వాత ఏం జరిగిందో నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే కమిషన్‌పై ఉంటుందని వాదించారు. కమిషన్ తన పరి ధి దాటి నివేదిక ఇచ్చిందని అందువల్ల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని వాదించారు. సుందరం వాదనలు విన్న త దుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఆరోజున కేసీఆర్ తరఫు న న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించనున్నారు.




