ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలిసిన కమిషనర్ తన్నీరు రమేశ్..
బెల్లంపల్లి, (విజయ క్రాంతి):బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తన్నీరు రమేష్ గురువారం బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిషనర్ రమేష్ గడ్డం వినోద్ ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి, ఘనంగా సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు గడ్డం వినోద్ మాట్లాడుతూ, బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పట్టణంలో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టణ సుందరీకరణకు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సూచనల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని కమిషనర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.






