calender_icon.png 12 February, 2026 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పెంగ్విన్’కు నోటీసులు

12-02-2026 01:46:58 AM

  1. నరవణే ఆత్మకథ పుస్తకంపై అనుమానాలు
  2. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఢిల్లీ పోలీసులు బుధవారం పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియాకు నోటీసులు పంపారు. ప్రచురితం కాని పుస్తకానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా ఎంఎం నరవణే రచించిన ’ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకానికి సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నరవణే రాసిన పుస్తకంలోని ఒక ఆర్టికల్‌ను లోక్‌సభలో ప్రస్తావించడం వివాదానికి కారణమైంది.

ఈ పుస్తకం ప్రచురణ కానప్పటికీ రాహుల్ గాంధీ చేతికి ఈ కాపీ ఎలా చేరుకుందని ఇండియా టుడే డిజిటల్ మీడియాలో కథనం వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పుస్తకం లీక్ అయినట్లు పేర్కొంటూ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇంకా ప్రచురితం కాని ఆ పుస్తకానికి సంబంధించి పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు.

వాటికి పెంగ్విన్ నుంచి సమాధానం అడిగారు. ప్రచురణ సంస్థ యాజమాన్యం విచారణలో భాగం కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వం అనుమతి పొందకముందే నరవణే రాసిన ఈ పుస్తకం బయటకు రావడం వివాదంగా మారింది. పుస్తకం ప్రచురితం కాలేదని, మార్కెట్‌లో అందుబాటులో లేదని ప్రచురణ సంస్థ 24 గంటల్లో రెండుసార్లు వివరణ ఇచ్చింది. కానీ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఆ పుస్తకం మార్కెట్‌లో లభ్యమవుతుందని అన్నారు.