calender_icon.png 12 February, 2026 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడా స్కూల్‌లో కాల్పులు

12-02-2026 01:44:45 AM

  1. తొమ్మిది మంది మృతి..మరో 27 మందికి గాయాలు
  2. కాల్పుల తర్వాత తానూ కాల్చుకున్న నిందితుడు
  3. బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఘటన
  4. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత ప్రధాని మోదీ

ఒట్టావా, ఫిబ్రవరి 11: కెనడాలో బుధవారం మధ్యాహ్నం కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్‌లోని ఓ సెకండరీ స్కూల్లో బుధవారం జరిగిన కాల్పుల్లో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా పది మంది మరణించగా సుమారు25 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కెనడా ప్రధానితో పాటు భారత ప్రధాని నరేంద్రమోదీ,పలు దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) తెలిపిన వివరాల ప్రకారం టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌తో పాటు సమీపంలోని ఓ నివాస గృహంలో కూడా ఈ కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్కూల్‌ను చుట్టుముట్టారు. లోపల గాలింపు చేపట్టగా, పలువురు మృత్యువాత పడి ఉండటాన్ని గుర్తించారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనలో స్కూల్‌లో ఆరుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, నివాస గృహంలో ఇద్దరు మరణించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని హెలికాఫ్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. మిగిలిన 25 మందికి స్థానిక వైద్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, బీసీ ఆర్సీఎంపీ మేజర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేపట్టిందని పోలీసులు వెల్లడించారు.

కాగా గోధుమ రంగు జుట్టు ఉన్న దుస్తులు ధరించిన మహిళను ఈ ఘటనకు అనుమానితురాలుగా భావిస్తున్నట్లు, కాల్పులు జరిపిన తర్వాత ఆమె తనను తాను కాల్చుకొని మరణించినట్లు పోలీసులు తెలిపారు.ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో, ఈ వారం మొత్తం స్థానిక స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

‘ఈ విషాద ఘటన బాధితుల కుటుంబాలకు, ఆప్తులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని ఆర్సీఎంపీ అధికారి ఒకరు ప్రకటనలో తెలిపారు. దాదాపు 2,400 మంది జనాభా ఉన్న టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో, పొరుగు ప్రాంతాల నుంచి అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.

  1. ఘటన కలచివేసింది 
  2. ప్రధాని మోదీ సంతాపం 

ఈ ఘోర దుర్ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో భారతదేశం కెనడా ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.