14 August, 2026 | 2:20 AM

రోడ్డు విస్తరణకు నోటీసులు

14-08-2026 12:00 AM

సాహెబ్‌నగర్ నుంచి హయత్‌నగర్ పాత రోడ్డు వరకు రహదారి విస్తరణ

40 అడుగుల రహదారిని 80 అడుగుల విస్తరణకు 

నోటీసులు ఇవ్వడంపై స్థానికుల ఆందోళన

ఎల్బీనగర్, ఆగస్టు 13: రోడ్డు విస్తరణకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నోటీసులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. సాహెబ్ నగర్ నుంచి హయత్ నగర్ పాత రోడ్డు వరకు రహదారి విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా హయత్ నగర్ సర్కిల్ - 14 టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు విస్తరణ నిర్వాసితులకు నోటీసులు అందజేస్తున్నారు. కాగా, నోటీసులు ఇవ్వడాన్ని సాహెబ్ నగర్ లో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా క్షేత్రస్థాయిలో మార్కింగ్ లు వేయడంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... సాహెబ్ నగర్ లోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వై జంక్షన్ నుంచి రెండు మార్గాల్లో రోడ్డు విస్తరణ చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు.

మొదటి మార్గంలో ఉమామహేశ్వర ఆలయం నుంచి గ్రామకంఠం, కుమ్మరికుంట మీదుగా హయత్ నగర్ పాత రోడ్డు వరకు సుమారు 3.5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఎడమవైపు 90, కుడివైపు 76 ప్రైవేటు ఆస్తులను తొలిగించనున్నారు. దీంతో పాటు రెండో రోడ్డు మార్గాన్ని ఉమామహేశ్వర ఆలయం, సాహెబ్ నగర్ నుంచి సామానగర్ మీదుగా హయత్ నగర్ పాత రోడ్డు వరకు చేయనున్నారు. రెండో మార్గంలో ఇరువైపులా 32 చొప్పున మొత్తం 64 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తొలిగించనున్నారు. 

ప్రస్తుతం రెండు రోడ్డు మార్గాల్లో 40 అడుగుల నుంచి 80 అడుగులకు విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి, టీపీవో సోమశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా నిర్వాసితులకు నోటీసులు జారీ చేసి మార్కింగ్ లు వేసి, నోటీసులు జారీ చేస్తున్నారు. రోడ్డు విస్తరణతో తమ ఇళ్లు, దుకాణాలు, ఆస్తులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి, టీపీవో సోమశేఖర్, ఆఫీస్ అసిస్టెంట్లు యామిని, ప్రవీణ్, చైన్ మన్లు తిరుమలేష్, చంద్రయ్య, ప్రకాశ్ తదితరు పాల్గొన్నారు.