14 August, 2026 | 1:15 AM

అడవిలోనే ఆదివాసీలు

14-08-2026 12:00 AM

స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడిచినా మారని తలరాతలు

పినపాక, ఆగస్టు 13, (విజయక్రాంతి): ఆదివాసుల జీవితాలు అడవిలోనే మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల ఆదివాసీ గ్రామాల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పినపాక మండలంలోని ఉమేష్చంద్రనగర్, సుందరయ్యనగర్, విప్పలగంప, పిట్టతోగు, చిర్రాపురం, ఎర్రగుంట కాలనీ, చింతలపాడు తదితర గ్రామాల్లో వందలాది కుటుంబాలు నేటికీ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జీవిస్తున్నాయి. రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

అత్యవసర పరిస్థితిలో వాహనాలు గ్రామాలకు చేరుకోలేకపోవడంతో గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేక సాయంత్రం కాగానే గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. విద్యార్థులు చదువుకోవడంతో పాటు సెల్ఫోన్ ఛార్జింగ్ వంటి సాధారణ అవసరాలకు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

ప్రభుత్వాలు అనేక అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నా తమ గ్రామాలకు మాత్రం పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. రహదారి, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.

ప్రధాన సమస్యలు ,ముఖ్యాంశాలు

- రహదారి, విద్యుత్ సౌకర్యాలకు నోచుకోని మారుమూల గిరిజన గ్రామాలు.n- పినపాక మండలంలోని పలు గ్రామాల్లో వందల కుటుంబాల ఇబ్బందులు- అత్యవసర వేళల్లో గ్రామాలకు చేరుకోలేని వాహ నాలు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయం.- విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారిన మౌలిక వసతుల కొరత.- ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆదివాసీల ఆవేదన.- రహదారి, విద్యుత్, తాగునీరు, వైద్యం, విద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్.

నాయకుల స్పందన

పినపాక నియోజకవర్గంలో ఎంతో మంది ఆదివాసీలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నారని టీపీజేఎస్ జిల్లా నాయకులు మడివి రమేష్ అన్నారు. రహదారి, విద్యుత్ సౌకర్యాలు లేకపోవడం వల్ల పిల్లలు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వాలు స్పందించాలి: మడివి రమేష్ (టీపీజేఎస్ జిల్లా నాయకులు)

ప్రతి గ్రామానికి రహదారి ఏర్పాటు చేయాలి 

‘అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు అందడం లేదని జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు గోగ్గల రామకృష్ణ దొర అన్నారు. రాత్రి వేళల్లో రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదివాసీ పిల్లలకు మెరుగైన విద్య అందాలంటే ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జల్-జంగల్-జమీన్ హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

గోగ్గల రామకృష్ణ దొర (జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు)