వారం రోజులు మంటలే
- పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం
- ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): వచ్చే వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండనున్నాయి. ఈ నెల 19- తేదీ మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం అవకాశముందని, దీనికి తోడూ వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం 11నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 45.7 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 45.3 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా భాన్సువాడలో 45.2 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 39.3 డిగ్రీలు నమోదైంది.
పాటించాల్సిన సూచనలివీ..
తలకు టోపీ లేదా టవల్ కట్టుకోవాలి. ముక్కు, చెవుల ద్వారా వేడి గాలి లోపలికి వెళ్లకుండా కర్చిఫ్ కట్టుకోవాలి. నూలు దుస్తులు ధరించాలి.
గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండ వేడికి చెమటతో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా పోతుంటాయి. దీనివల్ల అలసటతో పాటు అస్వస్థత కలుగుతుంది. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవాలి. నిమ్మరసం ఉప్పు, చక్కెర కలిపి తాగొచ్చు.
రేకుల ఇళ్లలో నివాసం ఉండేవారు, ఇళ్లలోకి నేరుగా ఎండ వచ్చేవారు, వేడి గాలు లు నేరుగా వచ్చే ఇళ్లలో ఉండే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. రేకులపై గడ్డి, జనపనా ర సంచులు వేసి వేడి తగ్గించుకోవాలి.
వడదెబ్బతో అస్వస్థతకు గురైతే వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి తల నుంచి కాళ్ల వరకు తడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. గాలి ఆడే విధంగా చూడాలి. కొంత తేరుకున్నాక ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించి ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధపడితే వారిని ఆసుపత్రికి తరలించాలి.






