ఎస్‌బీఐలో ‘నో క్యాష్’
- గంటల తరబడి క్యూ లైన్ లో ఖాతాదారులు
- రైతులు, ఖాతాదారులకు పగలే చుక్కలు చూపుతున్న అధికారులు
- అదనపు క్యాష్ కౌంటర్ ఖాళీగా దర్శనం..?
- రూ. 50 వేల కంటే ఎక్కువ ఇవ్వని వైనం
- క్యాష్ లేదు మేమేం చేస్తామంటూ దాటవేత...
- చర్యలు చేపట్టాలని ఖాతాదారుల డిమాండ్
లక్షెట్టిపేట, జూలై 7: సామాన్యుడికి అది ఆర్ధిక దేవాలయం. తన డబ్బులు భద్రంగా, రక్షణతో కూడిన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నాయని రాత్రింబవళ్లు గుండెపై చేయి వేసుకుని హాయిగా నిద్రించే సగటు మానవుని ఆర్ధిక ప్రశాంతతకు అది మూల కేంద్రం.
ఎప్పుడు తనకు డబ్బుల అవసరం వచ్చిన వెంటనే వెళ్లి తెచ్చుకోవచ్చనే ధీమాను ఇచ్చే వ్యవస్థ పేరే ’బ్యాంకు’. కానీ అదే బ్యాంకు వ్యవస్థ నెలల తరబడి సామాన్యుడి నడ్డివిరిచేలా, సహనాన్ని పరీక్షించేలా క్యూ లైన్ లో నిల్చోబెట్టి చివరకు పరిమిత స్థాయిలో డబ్బులిస్తాం, మీరు మా బ్యాంకు లో డబ్బులు దాచుకున్నంత మాత్రాన మీకు కావాల్సినప్పుడు ఇవ్వలేమంటోంది పట్టణంలోని గాంధీ చౌక్ ఎస్ బీ ఐ బ్రాంచ్.
గంటల తరబడి క్యూ లైన్...
బ్యాంకుకు డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి లేదా జమ చేయడానికి వచ్చే ఖాతాదారులు గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చొని ఉంటున్నారు. తీరా తమ వంతు రాగానే బ్యాంకు అధికారులు మాత్రం రూ. 50 వేల కంటే ఎక్కువ క్యాష్ ఇవ్వలేమని, పై నుంచి మాకు క్యాష్ రావడం లేదంటున్నారు. ఈ విషయంలో మేమేమి చేయలేమని చెప్పడంతో ఖాతాదారులు కంగుతింటున్నారు. అదేంటి మా డబ్బులు మాకు ఇవ్వడానికి గత నెల, రెండు నెలల నుంచి ఈ బ్యాంకులో ఇదే తంతు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితిలో డబ్బులు అవసరం పడి వస్తే, బ్యాంకు నుంచి ఇలాంటి అనుభవాలు ఎదురు కావడంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తాము అప్పులు చెల్లించాల్సిన చోట డబ్బులు చెల్లించక ఇతర మార్గాలు అన్వేషించి రైతులు, ఇతర ఖాతాదారులు విలువైన సమయాన్ని, రాకపోకల ఖర్చులను, ఇంటి దగ్గర పనులను వదులుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
అదనపు కౌంటర్ ఏమైంది..?
వివిధ అవసరాల దృష్ట్యా బ్యాంకునకు అధిక సంఖ్యలో ఖాతాదారులు వచ్చినప్పుడు బ్యాంకు అధికారులు రద్దీ దృష్ట్యా అదనపు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత క్యాషియర్ రెండు రోజులు ట్రైనింగ్ కు వెళ్లినట్టు చెబుతున్న అధికారులు ఆ స్థానంలో మరో అధికారిని ఏర్పాటు చేస్తే ఖాతాదారులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండే పరిస్థితి ఏర్పడదు.
మహిళలు, వృద్ధులు, మోకాళ్ళ నొప్పులు వున్నవారు ఎక్కువ సేపు లైన్ లో నిలబడే పరిస్థితి ఉండదు. క్యూ లైన్ లో లేకపోతే బ్యాంకు ఇచ్చే ఆ కనీస డబ్బులు కూడా చేతికి అందవని ఖాతాదారులు బాధను భరిస్తూ తమ డబ్బుల కోసం పగలే బ్యాంకులో చుక్కలు చూస్తున్నారు. లక్షేట్టిపేట బ్యాంకులో ఈ తతంగం చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
క్యాష్ రావడం లేదు మేమేం చేస్తాం
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ )నుంచే మాకు క్యాష్ రావడం లేదు. ఖాతాదారులు గత రెండు నెలలుగా ఇబ్బందులు ఎదురుకుంటున్నది వాస్తవమే. ఈ రోజు రూ. 50 వేలకు మించి ఖాతాదారులకు ఇవ్వడం లేదు. అదనపు క్యాష్ కౌంటర్ ఏర్పాటు చేస్తే, కేవైసీ పనిచేసే లైన్ రద్దీగా మారుతుంది. రెండు రోజుల తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. బయట నో క్యాష్ బోర్డు పెట్టినాము. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్య సమస్యలుంటే వారికి సహకరిస్తాం.
అశోక్, అసిస్టెంట్ మేనేజర్, ఎస్ బీ ఐ లక్షెట్టిపేట
గంటల తరబడి వేచి చూస్తున్నాం
బ్యాంకుకు వచ్చి మా డబ్బులు మేం తీసుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉంటున్నాం. బ్యాంకు అధికారులు ఇచ్చే పరిమిత డబ్బుల కోసం విసుగు వస్తోంది. నో క్యాష్ అంటున్నారు. మా పనులు అన్ని వదులుకుని నష్టపోతున్నాం. బ్యాంకు అధికారులు, ప్రభుత్వం పట్టించుకుని సమస్యను తీర్చాలి.
సత్తయ్య, రైతు నంబాల, దండేపల్లి
రైతులు ఇబ్బందులు పడుతున్నారు
పంటల సాగు కాలంలో రైతులు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వలన ఇబ్బంది పడుతున్నారు. బయట నో క్యాష్ బోర్డు పెట్టి మాకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించడంతో ఖాతాదారులకు అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. వెంటనే బ్యాంకు అధికారులు ఖాతాదారులకు క్యాష్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి.
రాచర్ల రవి కిరణ్, సీపీఐ పట్టణ అధ్యక్షులు, లక్షెట్టిపేట






