8 July, 2026 | 3:04 AM

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యం

08-07-2026 12:21 AM

భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

అబ్దుల్లాపూర్మెట్/ఇబ్రహీంపట్నం జులై 7 (విజయక్రాంతి): గత పదేళ్ల పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేగంగా జరుగుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరులో రూ. 338 కోట్ల వ్యయంతో ’హ్యామ్’ విధానంలో చేపట్టనున్న నాలుగు లైన్ల ఆధునిక రహదారుల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలనలో భాగంగా నియోజకవర్గంలోని 140 రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కోహెడలో రూ. 2,300 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో స్థానిక యువతకు భారీగా ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే తెచ్చిన ఫార్మాసిటీని రద్దు చేసి, ఈ ప్రాంత భవిష్యత్తు మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ’ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు మరోసారి కాంగ్రెస్కు అవకాశమివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.