8 July, 2026 | 1:17 AM

బీఎల్‌వోలకు బెదిరింపులు

08-07-2026 12:22 AM
  1. మజ్లీస్, కాంగ్రెస్ నాయకుల అడ్డగింత
  2. ఓటర్ల వివరాలు నమోదుకు నిరాకరణ
  3. బీఎల్‌వోలను ఒకేచోట కూర్చోబెట్టి దొంగ ఓట్లు నమోదు
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  5. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు 

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీఎల్‌ఓలను బెదిరిస్తూ, కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అక్కడి ప్రజల వివరాలు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. కొందరు బీఎల్‌ఓలను వెళ్లనీయకుండా ఒకేచోట కూర్చోబెట్టి దొంగ ఓట్లు నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈ విషయాలపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి ఆయన ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొందరు అనవసర అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు.

హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారిలో చాలామందికి తెలుగు తెలియదని, ఎన్యుమరేషన్ ఫారాలను ఇంగ్లీషులో అందించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారని, వారందరికీ తమ ఓటు నమోదు చేసుకునే అవకాశం సులభంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

దొంగ ఓట్లు, ముఖ్యంగా అక్రమంగా రోహింగ్యా ఓట్లు నమోదు కాకుండా ఎన్నికల సంఘం అప్రమత్తంగా వ్యవహరిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ పొరపాటున అలాంటి నమోదులు జరిగినా, బీఎల్‌ఏ-2 ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర జిల్లాల, ఇతర రాష్ట్రాల ప్రజలను బెదిరిస్తోందని తమ దృష్టికి వచ్చిందన్నారు.

స్వస్థలంలో లేకపోతే రేషన్ రాదు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ అంశంపై విచారణ జరిపిస్తామని సీఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు. జూలై 24 వరకు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో, గడువు పొడిగింపు అంశంపై తాము చర్చించి, అవసరమైతే భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు.