22-02-2026 12:00:00 AM
పంజాగుట్ట, ఫిబ్రవరి21(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య విద్యలో మరో మైలురాయిని అధిగమించింది. నాలుగు కీలకమైన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఎంసీహెచ్, డీఎం కోర్సులను నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతిని మంజూరు చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప వెల్లడించారు.
ఈ విషయమై ఆయన శనివారం మాట్లాడుతూ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, వాస్క్యులర్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో తలా నాలుగు ఎంసీహెచ్ సీట్లు, అలాగే ఆంకో పాథాలజీలో నాలుగు డీఎం సీట్లతో కలిపి మొత్తం 16 సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థ లలో ఆంకో పాథాలజీ విభాగంలో డీఎం సూపర్ స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టిన తొలి సంస్థగా నిమ్స్ రికార్డు సృష్టించిందన్నారు. ఈ గుర్తింపు నిమ్స్ విద్యా నైపుణ్యం, ఆధునిక మౌలిక వసతులకు నిదర్శనమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.