3 June, 2026 | 8:49 PM

వేములకొండకు నూతన బస్సు సేవ ప్రారంభం

03-06-2026 07:57 PM

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యం

 ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట మండల కేంద్రంలోని బస్టాండ్‌ నుంచి వేములకొండకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సేవను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సుకు పూజలు నిర్వహించి, జెండా ఊపి సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వేములకొండ ప్రాంత ప్రజలు చాలా కాలంగా నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ కొత్త బస్సు సేవను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు మరియు సాధారణ ప్రయాణికులకు ఈ సేవ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంతో పాటు, విద్య, వైద్యం, ఉపాధి అవసరాల కోసం పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కావడానికి ఈ బస్సు సేవ దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు మరియు పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు. నూతన బస్సు సేవ ప్రారంభం పట్ల వేములకొండ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.