27 July, 2026 | 11:50 AM

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య

27-07-2026 11:27 AM

సిద్ధాపూర్‌లో పోలీసుల అవగాహన సదస్సు 

అచ్చంపేట జూలై 27: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ ఎస్సై అంజయ్య(Siddhapur SI Anjaiah) సూచించారు. సోమవారం గ్రామంలో పోలీసులు ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసగిస్తున్నారని ఎస్సై తెలిపారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలు, ఏటీఎం కార్డు నంబర్లు, ఓటీపీ, పిన్‌ తదితర సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు.

గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్‌ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం చేయరాదన్నారు. ఆన్‌లైన్‌ రుణాలు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు, బహుమతులు వచ్చాయంటూ చేసే ఫోన్‌ కాల్స్‌, కేవైసీ అప్‌డేట్‌ పేరుతో వచ్చే సందేశాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, అనుమానాస్పద లావాదేవీలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎస్సై అంజయ్య సూచించారు. అలాగే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్‌ నేరాలను చాలావరకు అరికట్టవచ్చని పేర్కొన్నారు. సదస్సులో పోలీసులు, గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.