మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ మేలు చేస్తుంది
- ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మునుగోడులో సైకిల్ ర్యాలీ
మునుగోడు,(విజయక్రాంతి): మానవ ఆరోగ్య పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు సైకిల్ వినియోగమే ఉత్తమ మార్గమని పర్యావరణవేత్త, ఇండియన్ ఎన్విరాన్‌మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మునుగోడులో అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైకిల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
రోజువారీ జీవితంలో సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చని పేర్కొన్నారు. తహసీల్దార్ ఎన్. నరేష్, ఎంపీడీవో ఎం. విజయభాస్కర్, అటవీ శాఖ అధికారి స్వర్ణాల సుచరిత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, హరితహారం లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు ఏ. సుమన్, అఖిలేష్, ఎల్. చందన, వి. లావణ్య, ఏ. ప్రవీణ్ ఉన్నారు.






