30 May, 2026 | 3:53 PM

ఓజీ గూడలో నూతన బోర్‌వెల్ ప్రారంభం

30-05-2026 03:17 PM

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మండలం జంగం గ్రామపంచాయతీ ఓజీ గూడలో తాగునీటి కొరతను తీర్చేందుకు కొత్త బోర్‌వెల్‌ను ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి గ్రామ పంచాయతీ కొత్త బోర్‌వెల్ తవ్వించింది.శుక్రవారం ఈ బోర్‌వెల్‌ను గ్రామ సర్పంచ్ పెందూర్ అనుసయా అర్జున్, ఉప సర్పంచ్ సయ్యద్ సజ్జద్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి వార్డ్ మెంబర్ అంబిబాయి ఆత్రం, దిలీప్, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బోర్‌వెల్ నుంచి వచ్చిన నీటి సరఫరాను అందరూ పరిశీలించారు.స్వచ్ఛమైన తాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బోర్‌వెల్ అందుబాటులోకి రావడంతో ఓజీ గూడలోని అనేక కుటుంబాలకు నిత్యం తాగునీరు అందనుంది. ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితికి ముగింపు పలికినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.