గద్దెనెక్కడానికి హామీలు.. గెలిచాక కన్నీళ్లు!
నెట్టంపాడు కాలువలపై పాలకుల నిర్లక్ష్యం.. చివరి ఆయకట్టుకు నీరెప్పుడు?
99, 100, 106 ప్యాకేజీల్లో ఏళ్లుగా కొనసాగుతున్న పెండింగ్ పనులు
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. రైతు పొలాలకు మాత్రం నీటి నిరీక్షణ
ఇటిక్యాల, ఆగస్టు 23: ఎన్నికల వేళ హామీల వర్షం.. అధికారంలోకి వచ్చాక పనులపై కాలయాపన. నెట్టంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలోని కాలువల పరిస్థితి రైతుల సహనానికి పరీక్షగా మారుతోంది. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చివరి ఆయకట్టు రైతుల ప్రశ్నలు ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో కీలకమైన 99, 100, 106 ప్యాకేజీల పరిధిలోని కాలువల పనులు పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో ఆయకట్టు రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధాన కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు, లైనింగ్ వంటి పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రాజెక్టు లక్ష్యం చివరి ఆయకట్టు వరకు పూర్తిగా చేరడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దశాబ్దాలుగా అదే సమస్య
జలయజ్ఞం కాలంలో ప్రారంభమైన నెట్టంపాడు పనుల లక్ష్యం చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడమే. అయితే భూసేకరణ, నిధులు, పనుల పురోగతి, కాంట్రాక్టు సంబంధిత సమస్యలు తదితర కారణాలతో కొన్ని పనులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఒకప్పుడు ‘త్వరలో పూర్తవుతాయి’ అన్న మాటలు వినిపించాయి. ఆ తర్వాత గడువులు మారాయి. ప్రభుత్వాలు మారాయి. ప్రజాప్రతినిధులు మారారు. కానీ కాలువల కోసం ఎదురుచూస్తున్న రైతుల పరిస్థితిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
కృష్ణమ్మ కళ్లెదుటే.. పొలాలకు నీరేది?
కృష్ణా జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లే కాలువ వ్యవస్థ పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోతే ప్రాజెక్టు ప్రయోజనం రైతుకు ఎలా చేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాగునీరు అందకపోవడంతో పలువురు రైతులు బోర్లు, వర్షాధార సాగుపైనే ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల హామీలు ఎక్కడ?
కాలువల పనులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అంశంపై ఎందుకు వేగంగా నిర్ణయం తీసుకోవడం లేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇకనైనా సమీక్ష జరగాలి
99, 100, 106 ప్యాకేజీల పరిధిలోని పెండింగ్ పనులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ సమస్యలను పరిష్కరించడం, అవసరమైన నిధులు విడుదల చేయడం, నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించడం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్యాకేజీల పెండింగ్ పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి....
మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) ఉన్నతాధికారులు వెంటనే స్పందించి 99, 100, 106 ప్యాకేజీల పెండింగ్ పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి. భూసేకరణ సమస్యలను పరిష్కరించి, అవసరమైన నిధులు విడుదల చేసి పనులను వెంటనే పునఃప్రారంభించి చివరి ఆయకట్టుకు నీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
కె.వీర రాఘవేంద్ర రెడ్డి,
ఇటిక్యాల గ్రామ రైతు






