24 August, 2026 | 3:13 AM

లోటు వర్షపాతమే!

24-08-2026 01:39 AM
  1. రాష్ట్రంలో 15 జిల్లాలపై ఎల్ నినో ప్రభావం
  2. కామారెడ్డి జిల్లాలోనే ఆశించిన మేర వర్షాలు 
  3. వానాకాలం సీజన్ దాటుతున్నా పూర్తికాని పంటల సాగు
  4. సరైన వర్షాలు పడక అన్నదాతల్లో ఆందోళన 
  5. ఇప్పటీ వరకు 88 శాతం పంటల విస్తీర్ణంలోనే పంటలు  
  6. మొదటీ స్థానంలో పత్తి, రెండో స్థానంలో వరిసాగు 

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తెలంగాణలో వానాకాలం పంటలపై ‘ఎల్ నినో’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో ఇంకా లోటువర్షాపాతమే నమోదైంది. ఈ ఏడాది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే ఆశించిన మేర వర్షం కురిసింది. వానాకాలం సీజన్‌లో సగం రోజులు గడిచిపోయినా పంటల సాగు ఇంకా పూర్తి కాలేదు. సరైన వర్షాలు పడక అన్నదాత దిగాలు పడుతున్నాడు. ఆగస్టు మూడో వారంలోనూ రైతులు ఇంకా వరినాట్లు వేస్తూనే ఉన్నారు.

ఈ సీజన్‌లో మొత్తం పంట విస్తీర్ణంలో 87.67 శాతమే పూర్తయింది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరులో నూ వర్షాభావం ఏర్పడితే మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో పత్తితో పాటు ఇతర మెట్టపంటలు కోలుకున్నా వరికి మాత్రం గండం పూర్తిగా తొలగిపోలేదు. వాస్తవంగా వర్షాభావం వల్ల ఈసారి వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఆగస్టు రెండో వారానికి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా, రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో మొత్తం పంట విస్తీర్ణం కోటీ 32 లక్షల 38 వేల 446 ఎకరాలకుగాను ఇప్పటికీ కోటి 16 లక్షల 97 వేల 731 ఎకరాలు (88 శాతం)  సాగయింది. వరి మొత్తం విస్తీర్ణం 65,95,645 ఎకరాలకుగాను 48,75,107 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే తెలంగాణలో ప్రధాన పంట అయిన వరి 74 శాతానికే పరిమితమైంది.

ఇక పత్తి విషయానికి వస్తే 47 లక్షల, 41 వేల 541 ఎకారాల వరకు సాగు అంచనా వేయగా 48 లక్షల 19 వేల 063 ఎకరాలు (102 శాతం) సాగు చేశారు. అంచనా కంటే అధికంగా 2 శాతం పత్తిని రైతులు సాగు చేశారు. వరి కంటే పత్తి సాగే మొదటి స్థానంలోకి వెళ్లింది.  

జిల్లాల వారీగా పంటల సాగు ఇలా..  

జిల్లాల వారీగా పంటల సాగు చూస్తే.. అంచనా కంటే ఎక్కువగా ఆదిలాబాద్ (101 శాతం), ఆసిఫాబాద్ 4,52,317(105 శాతం), నిజాబాబాద్ (104 శాతం), కామారెడ్డి శాతం) పంటలు సాగు నమోదైంది. ఇక తక్కువ సాగు విస్తీర్ణమైన జిల్లాల్లో వరంగల్  (72 శాతం), మహబూబ్‌నగర్  (72 శాతం), వనపర్తి  (74 శాతం), సూర్యాపేట  (70 శాతం), యాదాద్రి భువనగిరి 329640 (78 శాతం), రంగారెడ్డి  (78 శాతం) పంటల సాగు నమోదైంది. ఇక మిగతా జిల్లాలలో 80 నుంచి 95 శాతం వరకు సాగు విస్తీర్ణం చేశారు.

ఈ పరిస్థితుల్లో బోర్లు ఉన్న రైతులు కాస్త ధైర్యంగా ఉన్నా మిగిలిన ప్రాంతాల్లోని అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వాయర్లు, నదీ పరీ వాహక ప్రాంతాల్లోని ఆయకట్టు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరులో వర్షాభావం ఏర్పడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తక్కువ వర్షపాతం జిల్లాలు

ఆదిలాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి.

సాధారణ వర్షపాతం జిల్లాలు

కొమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. 

కామారెడ్డిలో అధిక వర్షం.. హనుమకొండలో 45.95% లోటు

రాష్ట్రంలోని 15 జిల్లాలు, 272 మండలాల్లో తక్కువ వర్షపాతమే నమోదయింది. వానాకాలం సీజన్‌లో 482.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి ఇప్పటీవరకు 423.8 మిల్లీ మీటర్లు నమోదైంది. వర్షపాతం లోటు హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45.95 శాతం ఉండగా, అతి తక్కువగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 22.18 శాతంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో 22 శాతం నమోదైంది.

రాష్ట్రంలోని 621 మండలాలకు 256 చోట్ల 20 నుంచి 59 శాతం వర్షపాతం నమోదైంది. మరో ఎనిమిది మండలాల్లో 60 నుంచి 99 శాతం తీవ్ర లోటు వర్షపాతం రికార్డు అయింది. కేవలం 4 మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 90 చోట్ల అధిక, మరో 263  మండలాల్లో సాధారణ వర్షం కురిసినట్లు ప్రణాళిక విభాగం గణాంకాలు వెల్లడించాయి.