24 August, 2026 | 2:59 AM

జీహెచ్‌ఎంసీ నిద్రమత్తు!

24-08-2026 02:11 AM
  1. యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు 
  2. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం 

ఆదిభట్ల, ఆగస్టు 23 (విజయక్రాంతి): అధికారుల అండదండలు ఉన్నాయనో, లేదా వారి ఉదాసీనతో తెలియదు కానీ.. ఆదిభట్ల సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు మూడంతస్తులు  ఆరు పువ్వులుగా విరాజిల్లుతున్నాయి. స్థానికుల భయాందోళనలు, వర్షాల గండం వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

రాఘవేంద్ర కాలనీలో భయం భయం..

ఆదిభట్ల సర్కిల్ రాఘవేంద్ర కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం స్థానికులకు నిద్రలేకుండా చేస్తోంది. భారీ సెల్లార్ కోసం చేసిన అక్రమ తవ్వకాల వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ల పునాదులు బలహీనపడే ప్రమాదం ఏర్పడింది. గతంలోనే సెల్లార్ అక్రమ తవ్వకాలపై  వార్తా కథనాలు వెలువడినప్పటికీ, బాధ్యత వహించాల్సిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిర్మాణదారులు యథేచ్ఛగా నిబంధనలను నీళ్లొదిలి పనులు కానిచ్చేస్తున్నారు.

వేగంగా సాగుతున్న పనులు..

ఇప్పటికే ప్రమాదకర రీతిలో సెల్లార్ తవ్వకం పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అసలు ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి సరైన అనుమతులు ఉన్నాయా? సెల్లార్ కోసం ప్రత్యేక అనుమతిగానీ, అప్రూవల్  ప్లాన్  గానీ పొందారా? అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

పెరుగుతున్న ప్రమాద హెచ్చరికలు..

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సెల్లార్ తవ్విన గోతుల్లోకి నీరు చేరి, పక్కనే ఉన్న ఇళ్ల గోడలు దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే పక్కనే ఉన్న సిమెంట్ రోడ్లు కూడా కుంగిపోయే ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మామూళ్ల మత్తులో యంత్రాంగం?

టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడం వెనుక పెద్ద ఎత్తున ’మామూళ్లు’ చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నోటీసులు ఇవ్వడానికే పరిమితమవుతున్న అధికారులు, క్షేత్రస్థాయిలో పనులను నిలిపివేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

స్థానికుల డిమాండ్..

సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని, అనుమతుల వాస్తవాలను బయటపెట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై మరియు నిర్మాణదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాలు హెచ్చరిస్తున్నారు.