తమిళనాడులో ఎన్డీయే సీట్లు సర్దుబాటు
- ఎఐడీఎంకే 178, బీజేపీ 27, పీఎంకే 18, ఎఎంకే 11 స్థానాల్లో పోటీ
- చర్చలు ఫలప్రదం పళనిస్వామి.. త్వరలో మరిన్ని స్థానాలను ప్రకటిస్తాం
- కూటమి విజయం ఖాయం.. సుపరిపాలన అందిస్తాం: కేంద్రమంత్రి పీయూష్ గోయల్
చెన్నై, మార్చి 23: ఎట్టకేలకు తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్డీయే కూటమి సీట్లు ఖరారయ్యాయి. సోమవారం ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ముప్పాడి పళనిస్వామి, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, ఎఎంఎంకె ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చెన్నైలో సుధీర్ఘంగా చర్చించారు.
అనంతరం సీట్ల పంపకాలపై తుది నిర్ణయానికి వచ్చారు. 234 శాసనసభ స్థానాల్లో ఎఐడీఎంకే 178, బీజేపీ 27, పీఎంకే 18, ఎఎంకె 11 స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఈ మేరకు సీట్ల పంపకాల కేటాయింపు ఒప్పందంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎఐడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ.. కూటమిలో చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు. ఇంకా ఇతర పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. వారికి కేటాయించే స్థానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరి, తమిళనాడుకు సుపరిపాలన అందిస్తామన్నారు.
ఎన్డీయే ఒక సుస్థిర కూటమిగా పనిచేస్తుందని, అన్ని నిర్ణయాలను సమిష్టిగా తీసుకుంటామని చెప్పారు. కాగా తమిళనాడులో త్రిముఖ పోటీ అని భావిస్తున్నా, వాస్తవానికి రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 23న ఒకే దశలో తమిళనాడులో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మే 10తో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది.




