24 March, 2026 | 2:23 AM

పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం

24-03-2026 12:46 AM
  1. యుద్ధ ప్రభావం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చింది
  2. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాం
  3. పశ్చిమాసియా నుంచి 3.75 లక్షల మంది భారతీయులను రప్పించాం
  4. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం
  5. 41 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం
  6. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రజల జీవితాలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఈ సంక్షోభం భారత్‌కు ఆర్థిక, జాతీయ భద్రత, మానవతా పరమైన సవాళ్లను సృష్టిస్తోందన్నారు. సోమవారం ఆయన లోక్‌సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి ప్రసంగించారు. దేశానికి ఇంధన సరఫరా ఎలాంటి అంతరాయాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

భారత్‌కు అవసరమైన ముడిచమురు, గ్యాస్, ఎరువులు వంటివి పెద్ద మొత్తంలో హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని, యుద్ధం కారణంగాఈ మార్గంలో నౌకల రాకపోకలు సవాలుగా మారాయన్నారు. అయినప్పటికీ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని లోక్‌సభకు వెల్లడించారు.మూడు వారాలుగా యుద్ధంకొనసాగుతోందన్న ప్రధాని మోదీ.. భారత్ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు.

పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులు ఉన్నారని, గల్ఫ్‌లో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 24 గంటలూ కంట్రోల్ రూమ్స్, హెల్ప్‌లైన్స్ ఏర్పాటు చేశామని, 3.75 లక్షల మంది భారతీయులు క్షేమంగా వెనక్కి వచ్చారని మోదీ తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో 60 శాతం ఎల్‌పీజీ ఉత్పత్తి చేస్తున్నామని, 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. దేశంలో 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజరవ్స్ ఉన్నాయని, హోర్ముజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్‌కు వస్తున్నాయని మోదీ వెల్లడించారు.రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అయిందని కూడా మోదీ లోక్ సభలో చెప్పారు.

ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందన్న ప్రధాని, భారత్‌పై మాంద్యం ప్రభావం పడకుండా చూస్తున్నామని, ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ అన్నారు. ఖరీఫ్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తున్నామని, పవర్ ప్లాంట్స్‌కు కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. గల్ఫ్ సంక్షోభంపై పార్లమెంట్ మొత్తం ఒకే గళం వినిపించాలని మోదీ ఈ సందర్భంగా కోరారు.