క్రీడాకారులు ధ్యాన్చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలి
అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): క్రీడాకారులు ధ్యాన్చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ఆర్కే కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఆర్కే కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను, స్పోర్ట్స్ డేను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కే గ్రూప్ సీఈఓ, కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జైపాల్ రెడ్డి
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి జీవితంలో చదువుతో పాటు ఆటలు కూడా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. మానసిక ఉల్లాసానికి, శారీరక పటుత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు. గ్రామీణ స్థాయి నుండి వచ్చే విద్యార్థులు సరైన ప్రణాళికతో, నిరంతర సాధనతో ఒలింపిక్స్ స్థాయికి ఎదగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలలో ప్రతిభ చాటి విజయం సాధించిన విద్యార్థులందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ గా ఉన్న జైపాల్ రెడ్డి ని క్రీడల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులు నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా వారికి మరిన్ని క్రీడా అవకాశాలు, తగిన ప్రోత్సాహం లభిస్తుందని కళాశాల ప్రతినిధులు పేర్కొన్నారు.అనంతరం క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ, నినాదాలు చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ నవీన్, కో ఆర్డినేటర్ దత్తాత్రి, కళాశాల ప్రిన్సిపల్స్ గోవర్ధన్ రెడ్డి, గంగాధర్, వైస్ ప్రిన్సిపల్స్, పిడిలు, ఇంచార్జీలు,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






