30 August, 2026 | 1:11 AM

ఎల్బీనగర్ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట

30-08-2026 12:11 AM

చంపాపేట్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు మంజూరయ్యాయని నియోజకవర్గం ఇంచార్జి మధుయాష్కీ గౌడ్ తెలిపారు.

చంపాపేట్ డివిజన్ మారుతి నగర్లో రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో చంపాపేట్ డివిజన్లో వరద ముంపు సమస్య నివారణకు రూ. 5 కోట్ల నిధులతో పనులు పూర్తి చేశామని, ప్రస్తుతం రూ. 1.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

నియోజకవర్గ ఎమ్మెల్యే మూసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందినా ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, అలాగే ఎంపీ ఈటల రాజేందర్ నియోజకవర్గానికి తెచ్చిన నిధులేమిటో చెప్పాలని ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నిక వేళ తీసుకొచ్చిన 118 జీవో పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చిత్తు కాగితాల లాంటి కన్వీనియన్స్ డీడ్లు ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. అనంతరం దుర్గాభవాని నగర్లో పర్యటించి, క్రీడా ప్రాంగణం, ఇటీవల హైడ్రా రక్షించిన పార్కు స్థలం మరియు ఎస్సీ బస్తీలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు.