13 July, 2026 | 8:44 PM

చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణే రక్ష

13-07-2026 07:50 PM

ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం

సుల్తానాబాద్,(విజయక్రాంతి): చిన్నారులను నులిపురుగుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న జాతీయ నులిపురుగుల దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణి రాకేష్ మాట్లాడుతూ... చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పిల్లలే విద్యలో మెరుగైన ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం అందించే నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భోజనం ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా నులిపురుగుల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, మాజీ వార్డు సభ్యులు అమిరిశెట్టి తిరుపతి, ఏఎన్‌ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.