13 July, 2026 | 9:11 PM

నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నర్సింగ్ అభ్యర్థుల ధర్నా మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య డిమాండ్

13-07-2026 07:54 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న నర్సింగ్ అభ్యర్థులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఎంపికై నెల రోజులు గడిచినా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టింగ్‌లలో జాప్యం కారణంగా తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొన్నారు.ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోస్టింగ్‌లలో తీవ్ర జాప్యం కారణంగా అభ్యర్థులు సీనియారిటీతో పాటు నెల రోజుల వేతనాన్ని కూడా కోల్పోయారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసిన పలువురు అభ్యర్థులు ప్రస్తుతం ఆర్థిక, కుటుంబ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు విధుల్లో చేరాలి అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం కూడా ఉద్యోగాల్లో చేరకపోవడం నిరుద్యోగుల్లో నిరాశను పెంచుతోందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.శనివారం లోపు పోస్టింగ్‌లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదని అభ్యర్థులు తెలిపారు. హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ, లేనిపక్షంలో సోమవారం నుంచి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఉద్యమానికి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతాయని స్పష్టం చేశారు.ఎంపికై కూడా ఉద్యోగంలో చేరలేక నిరీక్షిస్తున్న నర్సింగ్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి తక్షణమే పోస్టింగ్‌లు కల్పించాలని ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.