ఓపికతో పోరాటం చేస్తాం.. ఐక్యంగా అడుగులు వేస్తాం
టెండర్లను వెంటనే నిలిపివేయాలి
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
యాదాద్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 32 రోజు నిరసన
గణపురం,జులై 29 (విజయక్రాంతి): ఓపికతో పోరాటం చేస్తాం ఐక్యంగా అడుగులు వేస్తామనిటెండర్ల ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త చర్యా సమితి ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(Kakatiya Thermal Power Station) ప్రధాన ద్వారం వద్ద 32వ రోజు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం సంబంధిత ప్రైవేటీకరణ టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంయుక్త చర్యా సమితి అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.






