calender_icon.png 18 February, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూపర్ స్మార్ట్ సిటీగా నల్గొండ..

18-02-2026 12:00:00 AM

  1. పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు

చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా చర్యలు

రోడ్డు డివైడర్లను తొలగించిన మంత్రి

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 17: నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా జిల్లా కేంద్రానికి గుండెకాయలా ఉన్న ప్రకాశం బజార్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.మంగళవారం ఉదయం నుండే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాబ్ గుట్ట, ప్రకాశం బజార్ ప్రాంతాలను సందర్శించారు.

ప్రకాశం బజార్లో ఫుట్ పాత్ పై చిరు వ్యాపారులు, పూలు ,పండ్లు వ్యాపారాలు చేసుకునేవారు డివైడర్ మధ్యలో వాటిని ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చాలా రోజుల నుండి ప్రజలు తన దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే డివైడర్లను తొలగించి అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునే సుమారు 60 నుండి 70 మంది పూలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారుల దుకాణాలన్నింటిని జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయ స్థలంలోకి తరలించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునెందుకు అనువైన స్థలం ఉందని, పార్కింగ్ కి ఇబ్బంది లేదని, ప్రస్తుతం ప్రకాశం బజార్లో 60 నుండి 70 మంది చిరు వ్యాపారులు ఫుట్పాత్ పై వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారని, అలాంటి వారందరిని గుర్తించి వారికి పాత కలెక్టర్ కార్యాలయ స్థలంలో వారి షాపు పరిమాణాలను బట్టి 50, 70, 100 గజాల స్థలాలను కేటాయిస్తామని తెలిపారు. పాత కలెక్టర్ కార్యాలయం స్థలంలో ప్రస్తుతం ఉన్న డీసీఎం పార్కింగ్ ను దేవరకొండ రోడ్ లోని హౌసింగ్ బోర్డ్ స్థలంలోకి తక్షణమే మార్చాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ప్రకాశం బజార్ లోని డివైడర్లను జెసిబి లో సహాయంతో అప్పటికప్పుడే తొలగించే చర్యలను చేపట్టారు. సాయంత్రం లోగా డివైడర్ తొలగింపును పూర్తి చేయాలని, పాత కలెక్టరేట్ స్థలంలో సీసీ వేయించి మార్కింగ్, లైనింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రకాశం బజార్లో భూగర్భ ఎలక్ట్రిసిటీ తో పాటు, సిసి రోడ్డు కొత్తగా వేయిస్తామని, ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉంటుందని అన్నారు.

స్థానిక చిరు వ్యాపారుల తో మాట్లాడారు. వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని, పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని, అందరికీ షాపులను కేటాయించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. గులాం ఖాదర్ పండ్ల వ్యాపారి నుండి మంత్రి అప్పటికప్పుడే 30 వేల రూపాయలు చెల్లించి పండ్లను కొనుగోలు చేసి అందరికీ పంపిణీ చేశారు.

ప్రకాశం బజార్లో సుమారు రోజు 10,000 మంది వ్యాపారం నిమిత్తం సందర్శిస్తుంటారని, గతంలో చిన్న వ్యాపారాలు, షాపులు ఉండేవని, ఎలాంటి రద్దీ ఉండేది కాదని జనాభా పెరగడం, వ్యాపారాలు పెరగడం వల్ల ప్రస్తుతం విపరీతమైన రద్దీ ఏర్పడి ట్రాఫిక్ తో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,తెలిపారు పేదవారికి ఎప్పుడు తాను సహాయం చేస్తానని, పేదల పక్షాన ఉంటానని వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ అశోక్ రెడ్డి, డిఎస్పి శివరామిరెడ్డి, ట్రాన్స్కో, మున్సిపల్, తదితర అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.