18-02-2026 12:00:00 AM
మిర్యాలగూడ, ఫిబ్రవరి 17: రైతుల అభివృద్ధి కోసం కార్యకలాపాలు నిర్వహించే కార్యాలయం ఆది. నాడు ఆ కార్యాలయ చైర్మన్ అండదండలతో ముఖ్య అధికారి అయిన ఆయన ఆగడాలకు నాటి నుంచి నేటి వరకు అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. దీంతో ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏ పని చేసిన స్వార్థపూరితంగా చేయడమే కాకుండా,
కార్యాలయంలో పనిచేసే కొంద రు సిబ్బందిని సైతం తన ఇంటి పనులను చేసేందుకు పంపుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు మీరు వస్తున్నాయి. ఈ తతంగమంతా జరుగుతున్నది ఎక్కడో కాదు.. నల్లగొండ డిసిసిబి ప్రధాన కార్యాలయంలో. డిసిసిబిలో ఆయన ముఖ్య అధి కారిగా బాధ్యతలు తీసుకునేనాటికీ ఆయనకు అర్హత వయసు మూడు నెలలు మాత్రమే ఉన్నట్లు కార్యాలంనుండే అందుతున్న విశ్వసనీయ సమాచారం.
అయితే నాటి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చొరవతో ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తుంది. ఈయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కార్యాలయమంతా తన ఆధీనంలోకి తీసుకుని నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసిసిబి కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఉండగా వాటిని పరిశీలించేందుకు తన ఛాంబర్ లో పెద్ద మానిటర్ ను ఏర్పాటుచేసి పర్యవేక్షించాల్సింది పోయి ఎటువంటి డిస్ప్లే లేకుండా కేవలం తన మొబైల్ కి మాత్రమే యాక్సెస్ పెట్టుకుని ఆన్లైన్లో వీక్షిస్తూ డిసిసిబి బ్యాంకు లో ఉన్న ప్రతి ఎంప్లాయ్ పనితీరును వ్యక్తిగతంగా గమనిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఇంతవరకు పర్వాలేదనిపించినా తనకు వ్యతిరేకంగా ఉన్న ఎంప్లాయ్ ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కార్యాలయంలోని ఉద్యోగులే తమ సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తంతు అంతా తెలిసినవారు ’శంకరా.. బుద్ధి వంకరా..?’ అంటూ తమ ఇష్ట దైవాన్ని ప్రశ్నిస్తున్నారు.
అవసరం లేకున్నా సిబ్బంది నియామకం
నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న డిసిసిబి బ్యాంకుల్లో అవసరం లేకున్నా సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి వారి దగ్గర నుంచి వేలకు వేలు డబ్బులు వసూలు చేసి నియమించిన సంఘటనలు చాలా ఉన్నాయంటూ బహిరంగంగానే చర్చించుకుంటుండడం గమనార్హం.
ఉద్యోగినితో సొంత పనులు
కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగితో తన సొంత పనులు చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం . ఆ మహిళ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి బ్యాంకు జీతం ఇస్తున్నప్పటికీ ఆ ముఖ్య అధికారి తన సొంత ఇంటి పనులు చేయించు కోవడం ఏంటని పలువురు బాహాటంగానే ప్రశ్నించుకుంటున్నారు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ క్లైమ్!
ఆ అధికారి వాస్తవికంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినప్పటికీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ను క్లైమ్ చేస్తున్నట్టుగా వినికిడి. వాస్తవికంగా ఈ పోస్టులో కొనసాగే అర్హత అతనికి లేనప్పటికీ ఈ కార్యకలాపాలన్నిటిని యదేచ్చగా నిర్వహించడంతో పాటు అక్రమ విధానంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ను లక్షల రూపాయలను కాజేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇది చాలదన్నట్టు ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయినప్పటికీ ఇంక్రిమెంట్లు పొందుతున్నాడని ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి.
చైర్మన్ మారినా తీరు మారలే
కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగే అవకాశం కలిగివున్న వ్యక్తిని గత చైర్మన్ ముఖ్య అధికారిగా నియమించినప్పటికీ అందులో మతలబును అవగతం చేసుకోకుండానే ప్రస్తుత పాలకవర్గం కూడా ఆయ ననే కొనసాగిస్తుందనే ఆరోపణలు స్థానికంగా వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం, చైర్మ న్ మారినప్పటికీ ఆయన తీరులో మాత్రం ఏ మార్పు రాలేదని జిల్లా ప్రజలు, రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
అలుముకున్న అనుమానాలెన్నో..
కార్యాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లక్షల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దుర్వినియోగం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు, పాలక వర్గం పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసినా అధికారులు, పాలకు లు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారా అంటూ స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లాలోని డిసిసిబి ఆధ్వ ర్యంలో కొత్త బ్రాంచ్ లు ఓపెన్ అయిన చోట నైట్ వాచ్ మెన్ అవసరం లేకున్నా డబ్బులు తీసుకొని నియమిస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఆయన ఆగడాలపై గతంలో టెస్కోబ్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని సిబ్బంది, ప్రజలు బహిరంగంగానే చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాలకవర్గం సభ్యులు ఈయన ఆగడాలపై దృష్టి సారించి పూర్తి వివరాలను బయటకు తీసి ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని మొత్తం రికవరీ చేసి ఇటువంటి సంఘటనలు పురావృతం కాకుండా చూడాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు .