మానవత్వం చాటుకున్న నాచారం పోలీసులు
మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తికి ఆశ్రయం పోలీసులు సేవలకు ప్రశంసలు
ఉప్పల్,(విజయక్రాంతి): మల్లాపూర్ ప్రాంతం నుంచి అందిన డయల్-100 కాల్‌కు వెంటనే స్పందించిన నాచారం పోలీసులు మానసిక పరిస్థితి సరిగా లేని ఓ వ్యక్తికి ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే, సుమారు 35 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి రోడ్డుపై తిరుగుతూ కనిపించడంతో స్థానికులు డయల్-100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ చిరంజీవి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని గుర్తించారు. అయితే అతను తన పేరు, చిరునామా లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎలాంటి వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది.
అనంతరం సోషల్ వర్కర్ రాజేష్ సహకారంతో సదరు వ్యక్తిని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆలేటి ఆశ్రమంలో చేర్పించి ఆశ్రయం, సంరక్షణ కల్పించారు.ఆ వ్యక్తి బంధువులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే నాచారం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.సమయోచితంగా స్పందించి ఓ నిరాశ్రయుడికి రక్షణ కల్పించిన కానిస్టేబుల్ చిరంజీవి, సోషల్ వర్కర్ రాజేష్‌ల సేవలను స్థానికులు మరియు పోలీసు అధికారులు అభినందించారు.






