కోటగిరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సిపి
- నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్ష
- డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి పటిష్ట చర్యలు
– రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ బుధవారం కోటగిరి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్‌తో పాటు సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని ఆదేశించారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. పేకాట, గుట్కా, ఇసుక అక్రమ రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు నిర్వహించాలని తెలిపారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు తక్షణమే స్పందించి సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య, రెచ్చగొట్టే పోస్టులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి కేసులతో పాటు ఇతర పెండింగ్ కేసుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పాత నేరస్థులపై నిఘా
రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పహారా మరింత బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని తెలిపారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, హైవేలను కలిపే లింక్ రోడ్ల వద్ద అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉంటే నేషనల్, స్టేట్ హైవే అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి వాటిపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
డయల్ 112పై విస్తృత ప్రచారం
రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, 24 గంటల పాటు వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






