12 August, 2026 | 10:51 PM

అంత్యక్రియల ఖర్చులు చెల్లించిన మున్సిపల్ అధికారులు

12-08-2026 09:15 PM

- మృతి చెందిన ఔట్‌సోర్సింగ్ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న శివలింగం అనే కార్మికుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలకు మున్సిపాలిటీ తరఫున చెల్లించాల్సిన డబ్బుల విషయంలో కొంతసేపు వివాదం నెలకొంది. మృతుడి అంత్యక్రియల కోసం నిధులు ఇవ్వాలని కార్మికులు మున్సిపల్ అధికారులను కోరగా, అధికారులు తొలుత నిధులు చెల్లించేందుకు నిరాకరించినట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు.

దీంతో విషయాన్ని యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ నాయకులు మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడినా నిధులు అందకపోవడంతో కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి నిరసన తెలపాలని కార్మికులు, యూనియన్ నాయకులు నిర్ణయించుకునే సమయంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు అక్కడికి చేరుకుని అంత్యక్రియల ఖర్చులను చెల్లించారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.

భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ

మృతుడు శివలింగానికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కార్మికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ఆయన భార్యకు మున్సిపాలిటీలో పని కల్పించాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఔట్‌సోర్సింగ్ కార్మికుల వారసులకు ఉద్యోగం కల్పించే విషయంలో ప్రభుత్వ జీవో ఉందని, నిబంధనల ప్రకారం వారసులను పనిలోకి తీసుకునే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే మృతి చెందిన, పదవీ విరమణ చేసిన 16 మంది మున్సిపల్ కార్మికుల వారసులకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి హైదరాబాద్‌కు పంపించామని, వాటికి ఇంకా ఆమోదం లభించలేదని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే వారసులకు ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కార్మికులు “శివలింగం అమర్ హై.. శివలింగంకు జోహార్లు” అంటూ నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులు నిధులు చెల్లించడం, కుటుంబానికి హామీ ఇవ్వడంతో కార్మికులు, యూనియన్ ప్రతినిధులు శాంతించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మృతుడి అంత్యక్రియలను పూర్తి చేశారు.