13 August, 2026 | 12:16 AM

బోధనలో అధ్యాపకులు నూతన పద్ధతులు అలవర్చుకోవాలి

12-08-2026 09:45 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ఉన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు.అనంతరం కళాశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్కులను అందజేశారు. డిజిటల్ బోధనా విధానాల ద్వారా విద్యార్థులకు అందుతున్న శిక్షణ, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న అధ్యాపకులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. అధ్యాపకులు నిరంతరం అభ్యసిస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేలా బోధన సాగాలని అన్నారు.

రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.కళాశాల ప్రాంగణం ఆహ్లాదకరంగా, పరిశుభ్రంగా ఉండటంపై ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంను కలెక్టర్ ప్రశంసించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం మెమొంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఎజాస్, దాసరి శ్రీనివాస్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల బాన్సువాడ ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్, లింగంపేట్ ప్రిన్సిపల్ నరేందర్, బాన్సువాడ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యాదగౌడ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.