17 May, 2026 | 6:11 PM

బేటీ బచావో-బేటీ పఢావో నినాదాలకే పరిమితం.. న్యాయం జరగడం లేదు

17-05-2026 05:16 PM

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నా బూత్-నా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బేటీ బచావో-బేటీ పఢావో అని ప్రధానమంత్రి మోడీ అంటున్నాడు. ఇది కేవలం నినాదాలకే పరిమితమైతే దేశంలో ఎక్కడ న్యాయం జరగదు మోదీ గారూ అని పేర్కొన్నారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా సాగే పరిస్థితి లేదని, నిష్పాక్షిక విచారణ కోసం బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం అది తెలంగాణకే కాదు, భారతదేశానికి కూడా అవమానకరమని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు తెలంగాణలో కులం పేరిట, మతం పేరిట మేము ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిలా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా ముందుకు నడిపించామని గుర్తు చేశారు. కానీ ఇవాళ మన మధ్య విద్వేషాలు రగిలిస్తూ కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలను మనమంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో హైదరాబాద్, తెలంగాణ బాగుపడాలంటే.. మళ్లీ గులాబీ జెండా ఎగరాల్సిందే! అని హితవు పలికారు.

రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని, ఒక బాలికకు అన్యాయం జరిగే ప్రభుత్వం మిన్నకుండిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయి. కానీ ఆ బాలికకు న్యాయం జరగాలని పోరాడింది మాత్రం మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అని ఆయన తెలిపారు.  బీఆర్ఎస్ పోరాటం వల్లే బాలికకు కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందని, తప్పు చేసిన వ్యక్తిని 9 రోజుల పాటు దాచిపెట్టింది కేంద్రమంద్రి కాదా..? అని ప్రశ్నించారు.  కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, నిందితుడిని దాచిపెట్టిన కేంద్రమంత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.