17 May, 2026 | 7:17 PM

ప్రజాపాలనలో చెరువు కట్టల మరమ్మతులు కరువు

17-05-2026 06:10 PM

చెరువు కట్ట వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వంలో కనీసం చెరువు కట్టల కు మరమ్మతులు కూడా నోచుకోవడం లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కన్నాపూర్ ,పోల్కంపేట్, కొత్తపల్లి  గ్రామాల చెరువు కట్టల వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల చెరువు కట్టలు తెగిపోయి మరమ్మతులకు నోచుకోవడం లేదని వచ్చేది వర్షాకాలం కనుక వర్షాలు కురిస్తే నీరు చెరువులో నిల్వ ఉండకుండా వృధాగా పోతుందని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు, అధికారులు స్పందించి చెరువు కట్టల మరమ్మతులు చేపట్టాలని కోరారు.

వరదలకు ధ్వంసం అయిన చెరువు కట్టల మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట పొలాలకు నీరు అందించే 100 సంవత్సరాల చరిత్ర గల ప్రధాన చెరువు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోయి కొన్ని కిలోమీటర్ల వరకు చెరువు పరివాహక పంట పొలాలలో మట్టి పేరుకు పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇప్పటివరకు చెరువు కట్ట మరమ్మత్తు పనులు జరగలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పట్టించుకోవడంలేదని స్థానిక గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ని సంప్రదించగా వెంటనే ఆదివారం చెరువుకట్టను సందర్శించి రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా చెరువు కట్ట మరమ్మత్తుల కొరకు ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపగా ఇప్పటివరకు  నిధులు మంజూరు కాలేదని తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చే వారం రోజులలో మరమత్తు పనులను ప్రారంభించక పోతే కన్నాపూర్ గ్రామం నుండి మూడు గ్రామాల రైతులతో తాను పాదయాత్రగా వెళ్లి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసారు.

లింగంపేట్ మండలంలోని కన్నాపూర్, పోల్కంపేట్, లింగంపల్లి చెరువు కట్టలను వెంటనే ప్రభుత్వ అధికారులు సందర్శించి మరమ్మత్తు పనులు ప్రారంభించాలని సూచించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సందర్శించిన లింగంపల్లి బ్రిడ్జి పనులే జరగలేదని ప్రస్తుత ఎమ్మెల్యే రైతులను ఆదుకోవడంలో, చెరువుల మరమ్మత్తులు చేపట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాడని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే  వెంట మండల బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వండలాది మంది పరిసర గ్రామాల రైతులు, మహిళలు పాల్గొన్నారు.