వాడీవేడిగా మున్సిపల్ సమావేశం
- అధికారులపై చైర్ పర్సన్ ఆగ్రహం
- సమాధానాలు చెప్పలేక తడబడిన అధికారులు
సదాశివపేట, మే 14 : సదాశివపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ అంజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులను నిలదీశారు. వివిధ శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ అంజమ్మ తనదైన శైలిలో అధికారులను హెచ్చరించారు. ప్రత్యేకంగా ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులపై కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డుల్లో నెలకొన్న సమస్యలు, పెండింగ్ పనులు, పారిశుద్ధ్య లోపాలపై ప్రశ్నలు సంధించినప్పటికీ సంబంధిత అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేక దాటవేత ధోరణి ప్రదర్శించారని సభ్యులు మండిపడ్డారు. లైసెన్స్ ఫీజులు, ఇంటి పన్నుల నిర్ధారణలో మున్సిపల్ మేనేజర్, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్ శంకర్ గౌడ్ ఆరోపించారు. ఒకే రకమైన ఇళ్లకు వేర్వేరు పన్నులు విధించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.
ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. కౌన్సిలర్ నసీరుద్దీన్ మాట్లాడుతూ పట్టణంలో కొత్తగా వేస్తున్న బోర్ల పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే పలువురు కౌన్సిలర్లు డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.






