27 August, 2026 | 6:13 PM

కుడి కాలువ పనులపై బీఆర్‌ఎస్ నాయకులకు విషయ పరిజ్ఞానం లేదు

27-08-2026 05:02 PM

చొప్పదండి,ఆగస్టు27(విజయక్రాంతి): నారాయణపూర్ కుడి కాలువ పనులపై బీఆర్‌ ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, క్షేత్రస్థాయిలో సాగునీటి పనులను అడ్డుకుంటూ రైతులలో గందరగోళం సృష్టిస్తున్నది వారేనని గంగాధర మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు ముద్దం నగేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గంగాధరలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(Medipalli Satyam) గారు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రాజెక్టులపై కనీస విషయ పరిజ్ఞానం లేకుండా బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) మాట్లాడుతున్నారని, తమ హయాంలోనే 98 శాతం కాలువ పనులు పూర్తి చేశామని చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నది నిజమే అయితే, మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  ఇప్పటికే రూ. 43.50 కోట్ల నిధులు ఎందుకు మంజూరు చేయించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, ఈ కుడి కాలువ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి కావడానికి ఇంకా సుమారు రూ. 50 కోట్ల నిధులు అవసరముందని, కేవలం 2 శాతం పనులు మాత్రమే మిగిలి ఉంటే ఇన్ని  కోట్ల నిధుల అవసరం ఎందుకు ఉంటుందో కనీస జ్ఞానం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో పనులను పూర్తిగా గాలికొదిలేసి  ఇప్పుడు అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూడటం వారి దివాళాకోరు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.

ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో ఈ పెండింగ్ పనులతో పాటు మిగిలిన డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, మైనర్ కాలువల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే స్థానిక రైతులు వారికి తగిన బుద్ధి చెబుతారని ముద్దం నగేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్,సర్పంచులు వేముల భాస్కర్,బీర్ల ఆనందం, దాసరి శంకరయ్య,పడాల భాగ్యలక్ష్మి రాజన్న, బాస వేణి శ్రీనివాస్, కడారి హారిక కనకయ్య, చిందం అంజనేయులు,గుండవేని లావణ్య తిరుపతి, కొలిపాక కవిత మల్లేశం,దీకొండ బాబ లక్ష్మి మధు పాల్గొన్నారు.