ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
మఠంపల్లి,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జెండా కేవలం ఒక జెండా మాత్రమే కాదని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం,సమాన హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ జెండా ఐక్యత,ధైర్యం,సేవాభావం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో హక్కుల సాధన కోసం నిరంతరం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవను మరింత కాలం కొనసాగించాలని ఆకాంక్షించారు.






