7 July, 2026 | 4:36 PM

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు

07-07-2026 03:34 PM

* భూభారతి  లో చూపించని రైతుల వివరాలు..

* రుణాల కోసం రైతుల ఆందోళన..

ఉట్నూర్,(విజయక్రాంతి): పంట రుణాల కొరకు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న బ్యాంకు అధికారులు  కరుణించడం లేదు. రెవెన్యూ శాఖ జారీ చేసిన  పట్టేదారు పాస్ పుస్తకాలు, పహానిలు, వన్ బీ లు పట్టుకొని  గిరిజన రైతులు బ్యాంకుల వద్దకు వెళ్తే  బ్యాంకు పోర్టల్ లో  సాగు చేసే భూముల వివరాలు  మామూలుగా లేవంటూ బ్యాంక్ అధికారులు  పంట రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  గిరిజన రైతులు  ఎన్నో ఏళ్లుగా  సాగు చేస్తున్న భూములకు రెవిన్యూ అధికారులు  పట్టేదారు పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు.

అధికారులు జారీ చేసిన  పట్టేదారు పాస్ పుస్తకాలతో  మీసేవ కేంద్రాల ద్వారా  పట్టేదారు  భూమికి సంబంధించిన పహానిలు, వన్ బీ లు వస్తున్న భూభారతిలో  పట్టేదారుకు సంబంధించిన  సర్వే నెంబర్లు  నమోదు కాలేదంటూ  బ్యాంక్ అధికారులు  పంట రుణాలు ఇవ్వడం లేదని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తీసుకున్న  పంట రుణాలకు  ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు రాగానే  పంట రుణాలు మాఫీ చేసిన సమయంలో బ్యాంకు పోర్టల్ లో  భూముల వివరాలు నమోదు అయి ఉన్నాయి.

రైతులుపుర్కా మాధవరావు, పెందూరు జంగుబాయి, పేందూర్ లక్ష్మణ్, పూసం కిషన్ రావు లతోపాటు  పలువురు రైతులు  ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేసిన సమయంలో తమకు పంట రుణాలు మాఫీ అయ్యాయని పలువురు రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే కిసాన్ యోజన పథకంలో సైతం  తమకు డబ్బులు పడుతున్నాయని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేసిన  రైతు భరోసా  డబ్బులు సైతం విడుదల అయ్యాయని రైతులు తెలిపారు.

ప్రభుత్వం రైతులకు అందించే ఫలాలు తమ భూమిపై అందుతున్నాయని  రైతులు అంటున్నారు. పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ నెల రోజులుగా తిప్పుకొని  తీరా రుణాలు ఇచ్చే సమయంలో  భూ భారతి పోర్టల్ లో  తమ భూముల వివరాలు నమోదు కాలేదని పంట రుణాలు ఇవ్వడం లేదని  సర్పంచులు కోవా రాజేశ్వర్, మెస్రం తుకారం, కోవా లాల్ షావ్, మెస్రం భీంరావు, రిట్టే విట్టల్  తదితరులు తెలిపారు. ఇప్పటికైనా గిరిజన రైతుల సాగు భూములకు పంట రుణాలు అందించి గిరిజన రైతులను ఆదుకోవాలని  సర్పంచులు డిమాండ్ చేశారు.