భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు
- ప్రభుత్వ పెద్దల అండతోనే భూ స్కామ్
- కాంగ్రెస్ అండతో రెచ్చిపోతున్న భూ మాఫియా ముఠాలు
- అక్రమాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదంటూ ఆందోళన
హైదరాబాద్: మంచి గుర్తింపు ఉన్న సంస్థకు ధరణి పోర్టల్(Dharani Portal) అప్పగించారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పేర్కొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ధరణి పోర్టల్ తీసుకువచ్చారని మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ప్రజల ఆస్తుల చిట్టాను ప్రైవేటు సంస్థ చేతిలో పెడతారా అని నాడు ఆరోపించారు. భూముల విషయంలో 22 వేల అక్రమాలు జరిగినట్లు ఓ పత్రికలో వచ్చిందని సూచించారు. భూమి బదలాయింపు జరగాలంటే భూ యజమానికి నోటీసు ఇవ్వాలని పేర్కొన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భూ అక్రమాలు
ఈ నిబంధనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ(Revenue Department) ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలో భూ స్కామ్ జరిగిందని ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ధరణి పేరు భూభారతిగా మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్న ఆయన మీ కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరిగిందా? అని ప్రశ్నించారు. జనగామ జిల్లాలో జనవరిలో కుంభకోణం బయటపడిందని గుర్తుచేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని 30 మంది మీసేవ నిర్వాహకులు దోపిడీ చేశారని తెలిపారు. రైతుల నుంచి రూ. లక్ష తీసుకుని ప్రభుత్వానికి రూపాయి కట్టారని, కాంగ్రెస్ అండతో అనే భూ మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయని ఫైర్ అయ్యారు.






