7 July, 2026 | 4:34 PM

ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

07-07-2026 03:30 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.మంగళవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), మెడికల్ కాలేజ్ ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రవీణ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకట్‌లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది కీలక పాత్ర పోషించారని, అయినప్పటికీ ఇప్పటికీ చాలీచాలని వేతనాలతోనే పనిచేయాల్సి వస్తోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆసుపత్రులను శుభ్రంగా ఉంచుతూ, రోగులకు సేవలందిస్తూ వస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కోసం నాలుగేళ్ల క్రితం IHFMS ద్వారా మూడేళ్ల కాలపరిమితితో టెండర్లు పిలిచారని, టెండర్ షెడ్యూల్‌లో G.O.Ms.No.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పేర్కొన్నప్పటికీ అమలు కాలేదని ఆయన అన్నారు.

ఆ ఉత్తర్వుల ప్రకారం PF, ESI మినహాయింపుల అనంతరం కార్మికులకు రూ.13,500 చెల్లించాల్సి ఉండగా, గత నాలుగేళ్లుగా కేవలం రూ.11,000 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఖరి కారణంగా కార్మికులు నష్టపోతున్నారని విమర్శించారు.కార్మికుల ప్రధాన డిమాండ్లలో కాంట్రాక్ట్ సిబ్బందికి నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించడం, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడం, నాలుగు పండుగ సెలవులు, నాలుగు జాతీయ సెలవులు, 15 ఆర్జిత సెలవులు అమలు చేయడం, PF-ESI సక్రమంగా జమ చేయడం, బోనస్ చట్టం ప్రకారం ఏడాదికి ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వడం, టెండర్ నిబంధనల్లో ఈ అంశాలను పొందుపరచడం, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం, జీతం చిట్టీలు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి.

సమస్యల పరిష్కారానికి భాగంగా జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల ముందు గంటసేపు నిరసన ధర్నాలు నిర్వహించనున్నట్లు, జూలై 9న హైదరాబాద్ కోఠిలోని కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు  తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, నాయకులు గంగన్న, సురేష్, మమత, మాధవి, జ్యోతి, ప్రియాంక, శరద్ తదితరులు పాల్గొన్నారు.