అమ్మా.. వెళ్లొస్తా
మానకొండూరు, మే 25 (విజయ క్రాంతి):చేతి కందిన కొడుకు అమ్మా వెళ్లొస్తానంటూ ఇంటి నుండి బయలుదేరి అదే చివరి మాటగా, విగత జీవిగా మారటంతో మాతృమూర్తి శోకసంద్రంలో మునిగిపోయింది. భర్త మరణించినా, కుమారుడు పైనే కోటి ఆశలు పెట్టుకున్నా మాతృమూర్తి మరలి రాని లోకాలకు కొడుకు తరలి వెళ్లాడనే చేదు నిజం తెలిసి హతాశురాలైంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సదాశివపల్లికి చెందిన యువకుడు జార్తి శ్రీనిధ్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు, ఎల్‌ఎండీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం&సదాశివపల్లి గ్రామానికి చెందిన జార్తి సంపత్ లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనిధ్. కాగా, సంపత్ రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.శనివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనిధ్ తిరిగి ఇంటికి రాలేదు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లి ఆందోళన చెందింది.
స్నేహితులు, బంధువులతో కలిసి వెతికినా ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా, ఇంట్లో దాచిన రూ.48 వేల నగదు కనిపించకపోవడం, తల్లి ఫోన్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి రూ.33 వేల వరకు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం ఉదయం తిమ్మాపూర్ మండలం ఆర్టీవో ఆఫీస్ వెనుక ఉన్న పల్లె ప్రకృతి వనం సమీపంలో శ్రీనిధ్ చెట్టుకు తాడుతో వేలాడుతూ కనిపించాడు. చేతులు తాడుతో కట్టబడి ఉం డటంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి.
ఘటన స్థలంలో మూడు బీర్ బా టిల్స్, చెప్పులు, శ్రీనిధ్ వాహనం లభించా యి. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పో లీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థ లానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. శ్రీనిధ్ మృతిపై కుటుంబ సభ్యులు హత్య అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని ఎల్‌ఎండీ ఎస్త్స్ర సయ్యద్ అన్వర్ తెలిపారు.
చౌరస్తాలో ధర్నా
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు అలుగునూరు చౌరస్తాలో ధర్నా చేశారు. దోషులను గుర్తించడానికి చట్టపరమైన చర్యలను వేగవంతం చేశామని, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని తిమ్మాపూర్ పోలీసులు నచ్చ చెప్పడంతో ధర్నా విరమించారు.






